నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ & రేటింగ్స్

నెక్స్ట్ నువ్వే మూవీ రివ్యూ & రేటింగ్స్






చిత్రం:‘నెక్స్ట్ నువ్వే’

నటీనటులు: ఆది సాయికుమార్ - వైభవి - రష్మి గౌతమ్ - బ్రహ్మాజీ - జయప్రకాష్ రెడ్డి - అవసరాల శ్రీనివాస్ - రఘు కారుమంచి తదితరులు
ఛాయాగ్రహణం: కార్తీక్ పళని
సంగీతం: సాయికార్తీక్
నిర్మాణం: వీ4 క్రియేషన్స్
కథ: డీకే
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ప్రభాకర్

చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అల్లు అరవింద్ సారథ్యంలో మొదలైన కొత్త బేనర్ ‘వీ4 క్రియేషన్స్’. ఈ బేనర్లో తెరకెక్కిన తొలి సినిమా ‘నెక్స్ట్ నువ్వే’. టీవీ హోస్టుగా - నటుడిగా పేరు సంపాదించిన ప్రభాకర్ దర్శకుడిగా మారి తొలిసారి తెరకెక్కించిన సినిమా ఇది. తమిళ హిట్ మూవీ ‘యామిరుక్క భయమే’కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ఆది-వైభవి జంటగా నటించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హార్రర్ కామెడీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కిరణ్ (ఆది) రూ.50 లక్షలు అప్పు చేసి ఓ సీరియల్ తీస్తాడు. కానీ పైసా వెనక్కి రాదు. అప్పు తీర్చలేక సతమతమవుతున్న అతడికి అరకులో తన పేరిట ఒక బంగ్లా ఉన్న సంగతి తెలుస్తుంది. ఎలాగోలా ఇంకో రూ.50 లక్షలు సంపాదించి.. ఆ డబ్బుతో బంగ్లా బాగు చేయించి దాన్నో రిసార్టుగా మారుస్తాడు ఆది. తన ప్రేయసి.. ఇంకో ఇద్దరితో కలిసి ఆ రిసార్ట్ నడపడానికి ఏర్పాట్లు చేసుకుంటాడతను. ఐతే ఆ రిసార్టుకు వచ్చిన వాళ్లు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆ బంగ్లాలో దయ్యం ఉందన్న భయం మొదలవుతుంది. ఇంతకీ వాళ్లందరూ ఎందుకు చనిపోవడానికి కారణమేంటి.. నిజంగానే ఆ బంగ్లాలో దయ్యం ఉందా.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

కొత్త టాలెంటుకు అవకాశమిస్తూ.. కొత్త తరహా.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ చేయడానికే ‘వీ4 క్రియేషన్స్’ అనే కొత్త బేనర్ పెట్టినట్లుగా చెప్పారు అల్లు అరవింద్. కాబట్టి ఈ బేనర్లో తెరకెక్కిన తొలి సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆశించారు ప్రేక్షకులు. కానీ ఆ ప్రత్యేకత కోసం సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు నిరీక్షిస్తూనే ఉంటాం. కానీ ఎక్కడా ఏ విశేషం కనిపించదు. ఇది ఏ ప్రత్యేకతా లేని ఒక సాదాసీదా హార్రర్ కామెడీ. ఇందులో జానర్ కు న్యాయం చేసే అంశాలు కూడా పెద్దగా లేకపోవడం ఆశ్చర్యకరం. హార్రర్ ఫ్యాక్టర్ పూర్తిగా తేలిపోగా.. అక్కడక్కడా ఓ మోస్తరుగా అనిపించే కామెడీ కొంచెం ఎంగేజ్ చేస్తుంది. కానీ అది కూడా పూర్తి స్థాయిలో పండలేదు.

‘నెక్స్ట్ నువ్వే’.. ‘యామిరుక్క భయమే’ అనే తమిళ హార్రర్ కామెడీ మూవీకి రీమేక్. ఈ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయింది. అప్పటికేమైనా ఈ సినిమా తమిళ ప్రేక్షకులు కొత్తగా అనిపించిందేమో కానీ.. ఇప్పుడొచ్చిన దీని రీమేక్ మాత్రం ఔట్ డేటెడ్ అనిపిస్తుంది. ఇందులో స్ట్రైకింగ్ గా అనిపించే అంశాలేమీ లేవు. సిల్లీగా అనిపించే కథ.. అందుకు తగ్గట్లే సాగే కథనం.. ఏ దశలోనూ ప్రేక్షకుల్ని సీరియస్ గా సినిమాలో ఇన్వాల్వ్ కానివ్వవు. లైట్ హార్టెడ్ కామెడీ పండించాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం చాలా ‘సిల్లీ’గా తయారైంది. సినిమా ఆద్యంతం ఈ సిల్లీనెస్ కనిపిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపూ అసలు ఏం ఉందని దీన్ని తమిళం నుంచి పట్టుకొచ్చారనే సందేహం వెంటాడేలా సాగుతుంది ‘నెక్స్ట్ నువ్వే’.

మొన్నే ‘రాజు గారి గది-2’ అనే హార్రర్ కామెడీ మూవీ వచ్చింది. అందులో ముగ్గురు కుర్రాళ్లు కలిసి రిసార్ట్ మొదలుపెట్టి వ్యవహారాలు నడుపుతుంటే అది రిసార్టే అన్న నమ్మకం కలుగుతుంది. కానీ ‘నెక్స్ట్ నువ్వే’లో మాత్రం జన సంచారమే లేనిచోట పాడుబడ్డట్లు కనిపించే ఒక బూత్ బంగ్లాకు రంగులేసి రిసార్ట్ అంటారు. ఇదే నమ్మశక్యంగా లేదంటే.. ఈ రిసార్టుకు వచ్చిన వాళ్లు వచ్చినట్లే చాలా సిల్లీగా చనిపోతుంటారు. ఇలా ప్రాణాలు పోతుంటే ఈ రిసార్టు యజమాని.. అతడి సహచరులు అసలేమీ జరగనట్లే సింపుల్ గా వాళ్లను తీసుకెళ్లి పాతి పెట్టేస్తుంటారు. వారిలో ఎలాంటి ఫీలింగ్ కానీ.. భయం కానీ కనిపించవు.

ఈ మరణాల మతలబు వెనుక ఏదైనా కావచ్చు.. కానీ అలా ప్రాణాలు పోయినపుడు తెరమీద కనిపించే పాత్రల నుంచి సీరియస్ రెస్పాన్స్ ఉండాలని ఆశిస్తాం. ఐతే ‘నెక్స్ట్ నువ్వే’లో అలాంటిదేమీ కనిపించదు. దీని వల్ల ప్రేక్షకులు ఏ దశలోనూ సినిమాను సీరియస్ గా తీసుకోరు. హార్రర్ కామెడీ కాబట్టి ఏమైనా చెల్లిపోతుందని లాజిక్ తో సంబంధం లేకుండా కథను నడిపించారు. ఈ విషయంలో మరీ ఎంత శ్రుతి మించారంటే యవ్వనంలో అవసరాల శ్రీనివాస్ ను చూపించి.. వయసు మళ్లే సరికి అదే వ్యక్తిని ఎల్బీ శ్రీరాంగా చూపిస్తారు. ఇందులో లాజిక్ ఏంటో మరి.

‘నెక్స్ట్ నువ్వే’లో ప్రేక్షకుల్ని కొంతమేర ఎంగేజ్ చేసేది బ్రహ్మాజీ కామెడీ మాత్రమే. బ్రహ్మాజీని సరిగ్గా వాడుకుంటే కామెడీ బాగా పండించగలడనిఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అతడి పాత్ర కనిపించినపుడల్లా కాస్తో కూస్తో నవ్వులు పండుతుంటాయి. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా బ్రహ్మాజీ పాత్ర వరకు ఫన్ వర్కవుట్ అయింది.రష్మి సెక్సీగా కనిపిస్తూ మాస్ ప్రేక్షకుల్ని కొంత మేర ఎంగేజ్ చేస్తూ సాగుతుంది. కానీ ఆ పాత్రను ఎందుకు పెట్టారని మాత్రం అడగకూడదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏమంత ఆసక్తికరంగా లేదు. సినిమాలో హార్రర్ ఫ్యాక్టర్ కూడా తేలిపోయింది. మొత్తంగా చూస్తే ‘నెక్స్ట్ నువ్వే’ కొత్తదనం.. లాజిక్ లేకుండా సాగే ఒక మామూలు హార్రర్ కామెడీ.

నటీనటులు:

ఆదికి నటుడిగా గుర్తింపునిచ్చే సినిమా కాదిది. చాలా మామూలు పాత్ర అతడిది. అతను ఈజీగానే లాగించేశాడు. హీరోయిన్ వైభవి ఏ రకంగానూ ఆకట్టుకోదు. ఆమెఅందంగానూ లేదు. నటనా అంతంతమాత్రమే. అందరిలోకి బ్రహ్మాజీ ఒక్కడు బాగా ఎంగేజ్ చేశాడు. అతడి కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. రష్మి గౌతమ్ వ్యాంప్ తరహా పాత్రలో సెక్సీగా కనిపించింది. చిన్న పాత్రలో అవసరాల శ్రీనివాస్ పర్వాలేదు. జయప్రకాష్ రెడ్డి.. రఘు కారుమంచి.. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గా ‘నెక్స్ నువ్వే’ ఏమంత గొప్పగా అనిపించదు. సాయికార్తీక్ పాటలు ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. కార్తీక్ పళని ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. అల్లు అరవింద్ భాగస్వామ్యం ఉన్న సినిమా అయినా.. ఆయన స్థాయికి తగ్గ నిర్మాణ విలువలు ఇందులో కనిపించవు. అన్ని హార్రర్ కామెడీల్లాగే ఇది కూడా ఒకే ఒక బంగ్లాలో చుట్టేశారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా గ్రాండియర్ ఏమీ కనిపించదు. ఇక దర్శకుడు ప్రభాకర్.. తమిళ సినిమాతో పోలిస్తే చాలా మార్పులు చేసినట్లు చెప్పాడు కానీ.. అలా ఏమీ కనిపించదు. చాలా వరకు మాతృకనే ఫాలో అయిపోయాడతను. రచయితగా కానీ.. దర్శకుడిగా కానీ అతడి ముద్రంటూ ఏమీ కనిపించదు. కొన్ని కామెడీ సీన్లు.. డైలాగుల వరకు పర్వాలేదనిపించాడు.

చివరగా: నెక్స్ట్ నువ్వే.. బోరింగ్ హార్రర్ కామెడీ

రేటింగ్స్ :

123telugu - Rating :2.75 /5

Telugu Mirchi - Rating :2.5 /5


Tupaki - Rating : 2.25/5


Chitramala - Rating : 2.5/5







Share:

No comments:

Post a Comment

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages