అప్లికేషన్‌ రిజెక్టెడ్‌.. కారణం ఏమిటో తెలుసా...!

అప్లికేషన్‌ రిజెక్టెడ్‌.. కారణం ఏమిటో తెలుసా...!

అర్హతలకు తగిన ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వెలువడింది. దరఖాస్తు దశలోనే రిజెక్టెడ్‌ అనే మెయిల్‌ వచ్చింది. చాలా కంపెనీలు తిరస్కరణకు కారణాలు కూడా చెప్పవు. ఇంటర్వ్యూకు కూడా పిలవకుండా ఎలా తిరస్కరించారబ్బా అంటూ అప్పుడు మల్లగుల్లాలు పడటం తప్ప చేసేది ఏమి ఉండదు. అసలు దరఖాస్తు దశలోనే ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుంటే మంచిది కదా!

 

బ్లాగుతో అంతా కాదు

దరఖాస్తు ఎలా నింపాలో చెప్పడానికి ఇప్పుడు బోలెడు వెబ్‌సైట్‌లు, బ్లాగులు, అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు పూర్తి చేయడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. అయితే వీటితో త్వరగా పని పూర్తి చేయొచ్చు అనుకుంటే బుట్టలో పడినట్లే. అవన్నీ మనకోసమే ఉన్నాయనే భ్రాంతిలో ఉండొద్దు. అలాంటి బ్లాగులో నుంచి మనకు నప్పింది తీసుకుని, అవసరానుగుణంగా కొద్దిగా పాలిష్‌ చేసి, మెయిల్‌ చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. చాలా సందర్భాల్లో అవి అభ్యర్థి అంతరంగానికి అద్దంపట్టకపోవచ్చు. ఈ బ్లాగులు, సైట్లు రెజ్యూమె నింపేందుకు దారి చూపుతాయే తప్ప మనల్ని గమ్యానికి చేర్చవు. హైరింగ్‌ మేనేజర్‌కు మీరు చెప్పాల్సింది చేరదు. ఫలితంగా కనీసం ఇంటర్వ్యూకి పిలుపు అందదు.

 

సంక్షిప్తత ముఖ్యం

దరఖాస్తు ఎ4లో రెండు పేజీల వరకు ఉండొచ్చని ఎక్కువ మంది చెబుతూ ఉంటారు. అదే నమ్ముతూ సమస్త సమాచారాన్ని ఆ రెండు పేజీల్లోనే కూరడానికి ప్రయత్నిస్తుంటారు. నిజానికి అనవసర సోది విషయాలను పక్కకు పెట్టి, బోర్‌ కొట్టించకుండా అసలు సంగతులను చక్కగా పేర్చగలిగితేనే దరఖాస్తు ఆకట్టుకుంటుంది. ఉదాహరణకు టెన్నిస్‌ క్రీడలో ప్రావీణ్యం ఉంటే ఆటకు సంబంధించిన పది పాఠాలు మొదటి పేజీలో చెప్పి, మీ సామర్థ్యం ఎక్కడో చెపితే ఉపయోగం ఉండదు. అది రిక్రూటర్‌ దరి చేరదు. నిజంగా చెప్పగలిగిన విషయాలు ఉంటే రెండు దాటినా పర్వాలేదు. అయితే చాలామంది ప్రింటవుట్‌ అందజేసే సమయంలో చివరి పేజీలను జత చేయడం మర్చిపోతుంటారు. అక్కడ జాగ్రత్తలు పాటిస్తే బెటర్‌.

 

సూచనలను పాటించాలి

జాబ్‌ ప్రకటనలో చేసిన సూచనలను ఎక్కువ మంది పాటించరు. ఫలానా విధంగానే దరఖాస్తు చేసుకోవాలని లేదా తమకు అవసరమైనవి ఆ కొద్ది విషయాలు మాత్రమేనని ప్రకటనలోనే కచ్చితంగా చెప్పినప్పుడు అవి పాటించి తీరాల్సిందే. అందుకు తగ్గట్టుగానే దరఖాస్తు ఉండాలి. జాబ్‌ ప్రకటనలో ఎలాంటి నిబంధనలు లేనిపక్షంలో మనకు నచ్చిన విధంగా దరఖాస్తును రూపొందించుకునే వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల జాబ్‌ ప్రకటనను క్షుణ్ణంగా చదవాలి. అప్పుడే మనకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అన్న సంగతులు తెలుస్తాయి.

 

ఒకే కంపెనీకి పదేపదే

ఒక కంపెనీలో పలు ఉద్యోగాలకు మీరు అర్హులే కావచ్చు. అంతమాత్రాన ఆ కంపెనీ ప్రకటన ఇచ్చిన ప్రతీ జాబ్‌కు దరఖాస్తు చేయకూడదు. ఉద్యోగాలు వేర్వేరు అయినప్పటికీ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారాలు చూసే టీమ్‌ ఒకటే ఉంటుంది. ఈ రోజుల్లో అన్నీ వెబ్‌ ఆధారిత దరఖాస్తులే. పేరు కొట్టగానే అభ్యర్థి ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడో తెలిసిపోతుంది. ఇది అభ్యర్థుల ఆందోళనను బయటపెడుతుంది. ఏదో ఒక రంగం పట్ల అతని ఆసక్తిని వ్యక్త పరచదు, అభ్యర్థికి కెరీర్‌ పట్ల స్పష్టమైన అవగాహన లేదనే అభిప్రాయాన్ని కలుగజేస్తుంది.

 

సరళత ముఖ్యం

దరఖాస్తులో టైపింగ్‌ తప్పులు పెద్ద విషయం కాదని చాలా మంది అభ్యర్థులు భావిస్తుంటారు. రెండు మూడు పర్యాయాలు దరఖాస్తు మొత్తం చదువుకున్నప్పటికీ ‘సెండ్‌’ బటన్‌ కొట్టే సమయంలో కూడా ఏదో ఒక తప్పు కనిపిస్తుంది. అంతే కాదు అన్‌ ప్రొఫెషనల్‌గా ఉండే ఉదాహరణలు, పదాలు కూడా సీవీల్లో దొర్లుతుంటాయి. ఇలాంటి వాటిని రిక్రూటర్లు సీరియస్‌ విషయంగా పరిగణిస్తారు.

 

పంచ్‌ కవర్‌ లెటర్‌

సుదీర్ఘంగా, పదేపదే దొర్లే పదాలతో కవరింగ్‌ లెటర్‌ రాయ వద్దు. ప్రతి జాబ్‌కు వందలాది దరఖాస్తులు వస్తున్న రోజులివి. ఒకే రకమైన భావం, పదాలతో కూడిన దరఖాస్తులు హైరింగ్‌ మేనేజర్లు రోజూ చూసి విసుగెత్తి ఉంటారు. పంచ్‌ పదాలు, భిన్నంగా ఉన్నవి రిక్రూటర్లను ఆకట్టుకుంటాయి. ఇవే మిగిలిన వారినుంచి భిన్నంగా నిలబెడతాయి. ఉద్యోగంలో కలిగిన ఏదో ఇబ్బందిని మీరు ఎలా సులువుగా పరిష్కరించారు, ఇతరుల కంటే ముందే సదరు ఉద్యోగానికి అవసరమైన టెక్నాలజీని మీరు ఎలా అందిపుచ్చుకున్నారు తదితరాలు రిక్రూటర్‌ను ఆకట్టుకుంటాయి. కవరింగ్‌ లెటర్‌ అంటే ఒక ఐదారు వందల పదాలతో రాయవద్దు. మూడు చిన్ని పేరాలు ఉంటే చాలు. సైజు పెరుగుతున్న కొద్దీ చెత్తబుట్టలోకి చేరడానికి దగ్గరవుతున్నట్లు లెక్క.

Post sources : ఆంధ్రజ్యోతి

Share:

No comments:

Post a Comment

Categories

Sample Text

ALL AT SITE is web site where you can find and download content

Pages